Welcome to Idambraahmam

About Us

"ఇదం బ్రాహ్మం" అనేది బ్రాహ్మల కోసం బ్రాహ్మలు నడిపే బ్రాహ్మణ వ్యవస్థ. భారతదేశానికి ప్రాణం సనాతన ధర్మం. అది పదిలంగా ఉండాలంటే ఆ ధర్మానికి శిరస్సు అయిన బ్రాహ్మణ వర్గం రక్షించబడాలి.అన్ని రంగాలకు చెందిన బ్రాహ్మణ కులస్థులను పరస్పర సహకార ప్రాతిపదికన ఏకంచేసి , సమష్టి కృషితో అన్ని జీవన రంగాలలో అందరం ముందుకు వెళ్ళాలన్న ఆలోచన 2014 లో ఇదం బ్రాహ్మం ఆవిర్భావానికి ప్రేరణ.

ఇదం బ్రాహ్మం లో చేరే వారికి తాము బ్రాహ్మణులమన్న స్పృహ ఉండాలి. తాము బ్రాహ్మణులమని చెప్పుకోవటానికి సిగ్గు పడని వారై ఉండాలి. పైకి చెప్పినా చెప్పక పోయినా మిగతా అన్ని కులాలవారికి చాలా ఉన్న కులాభిమానం తమకూ ఉండటంలో తప్పులేదని ధైర్యంగా కనీసం తమకు తాము చెప్పుకోగలగాలి. ఒకరికొకరం సాయపడుతూ అందరం ముందుకెళ్ళాలన్న విశాలదృష్టి ఉండాలి. మన సమాజం అవసరాలను , ప్రయోజనాలను మనమే తీర్చుకోవాలి. ఏ రంగంలో వెనక బడిన వారికి ఆ రంగంలో ముందున్న వారు చేయూతనివ్వాలి.

ఈదేశానికి ప్రాణ శక్తి అయిన సనాతన ధర్మం నిలబడాలంటే మునుముందు బ్రాహ్మణ్యం నిలబడాలి. వేదం, మంత్రం, అనుష్ఠానం, ఆచారం, అగ్నిహోత్రం ,ధర్మవిచారం ,ధర్మప్రచారం, సర్వజన సంక్షేమ చింతనం వగయిరాలను నిష్ఠగా నియమబద్ధంగా, స్వచ్ఛంగా , శుద్ధంగా సాగించడం సామాజిక బాధ్యతగా నిర్దేశించబడిన బ్రాహ్మణీకం మంటగలిసినప్పుడు సనాతన ధర్మమూ దానివెంటే అగ్నిహోత్రం పాలు అయ్యే ప్రమాదం ఉంది.

ధర్మాన్ని కాపాడుకోవాలంటే బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ ధర్మాన్ని , సంప్రదాయాన్ని, పూర్వాచారాన్ని , పూర్వులు,ఋషులు పెట్టిన విధినిషేధాలను గౌరవించాలి; ప్రోది చేయాలి; సాధ్యమైన మేరకు ఆచరించాలి; సంఘ వ్యవస్థలో మనకు నిర్దేశించబడిన భూమికను వీలైనమేరకు నిర్వర్తించాలి- అన్న సమ్యక్ దృక్పథం ఉండాలి. బ్రాహ్మణులను పరస్పర సహకార ప్రాతిపదికన సంఘటితపరచటానికి. పేద బ్రాహ్మణుల సంక్షేమానికి , బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కి వీలైనమేరకు చేయూతనివ్వటానికి. పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వృత్తి ,వ్యాపారాల వంటి విషయాల్లో బ్రాహ్మణ కులస్థులకు సహాయకారి కావటానికి దోహదం చేయటం ఇదం బ్రాహ్మం ధ్యేయం.